రైతుల భూములు లాక్కుంటే ట్రాక్టర్లు పార్లమెంట్‌పైకి దూసుకొస్తయ్

రైతుల భూములు లాక్కుంటే ట్రాక్టర్లు పార్లమెంట్‌పైకి దూసుకొస్తయ్
  • పార్లమెంట్‌కు ట్రాక్టర్‌‌తో వచ్చిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ (సోమవారం) పార్లమెంట్‌కు కొత్త వెహికల్‌పై వచ్చారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమ సందేశాన్ని  వెంటబెట్టుకు వచ్చానంటూ ట్రాక్టర్‌‌ నడుపుకుని పార్లమెంట్‌కు చేరుకున్నారు. ‘‘నేను రైతుల సందేశాన్ని పార్లమెంట్‌కు తీసుకొచ్చాను. రైతుల గళాన్ని ప్రభుత్వం అణచివేస్తోంది. పార్లమెంట్‌లో వాళ్ల సమస్యలను చర్చకు రానివ్వడం లేదు. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ చట్టాలు 23 మంది వ్యాపారవేత్తలకు మాత్రమే  అనుకూలమని దేశం మొత్తానికి తెలుసు” అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు.
ప్రభుత్వం దృష్టిలో వాళ్లు టెర్రిరిస్టులు
దేశంలో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారన్న భావనలో కేంద్ర ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న వాళ్లంతా టెర్రరిస్టులనే దృష్టితో కేంద్రం చూస్తోందన్నారు. కానీ వాస్తవానికి రైతుల హక్కులను కొత్త అగ్రి చట్టాలు లాగేసుకుంటున్నాయని, ఒక వేళ రైతుల భూములను బలవంతంగా లాక్కునే పరిస్థితి వస్తే ట్రాక్టర్లు పార్లమెంట్‌ మీదికి దూసుకొస్తాయని హెచ్చరించారు.


రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటి?
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలకు ముగింపు పలకాలని కోరుతూ అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిరసనలను మరింత తీవ్రతరం చేయాలని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంద్రాగస్టున హరియాణాలోని జింద్‌తోపాటు దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీకి  సమాయత్తం అవుతున్నారు. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. 
‘అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ తీయడంలో తప్పేముంది? ట్రాక్టర్ ర్యాలీ తీయడం చెడ్డ విషయమేం కాదు. హరియాణాలోని జింద్‌ ప్రజలు విప్లవాత్మక భావాలు కలిగిన వారు. పంద్రాగస్టున ట్రాక్టర్ పరేడ్ చేయాలని వారు తీసుకున్న నిర్ణయం సరైనదే.  అయితే సంయుక్త కిసాన్ మోర్చా ఏ నిర్ణయం తీసుకుంటనేది చూడాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున రైతులు జాతీయ జెండాలతో పరేడ్ తీస్తే గర్వంగా ఉంటుంది. ఇది జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తుంది’ అని తికాయత్ పేర్కొన్నారు.